ఓ పెళ్లి కథ లోని గాఢమైన ఒక సాదృశ్య వీచిక
"ఒక మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకోవటానికి కీలకమైన సంఘటన కనుక్కోవడానికి,' నీ మొట్ట మొదటి జ్ఞాపకం ఏమిటి?' అని అడుగుతారట . నా మొట్ట మొదటి జ్ఞాపకం - చచ్చిపోతున్న అమ్మ నన్ను దగ్గరకు తీసుకోవాలన్న తీవ్రమైన కోరికతో చేతులు ముందుకు చాచి, అంతలోనే అది నాకు ఫ్రమాదకరమన్న గ్రహింపుతో వెనక్కు తీసుకోవటం. నిరాశతో, నిస్పృహతో నెమ్మదిగా వెనక్కు వాలిపోయిన అమ్మ చేతులే నా మొట్టమొదటి జ్ఞాపకం అనుకుంటాను ... అమ్మ పేరు సీతమ్మ ... " అన్నాడు.
ఇటువంటి జ్ఞాపకం కీలకంగా ఏర్పడిన కృష్ణ మనస్తత్వం జీవితంలోని దుఃఖానికి , సత్యానికి చేరువలో ఉండటంలో ఆశ్చర్యం లేదు .
"నీ మొట్టమొదటి జ్ఞాపకం ఏమిటో చెప్పు ?" అన్నాడు కొంచం సేపు ఆలోచించి," నేను నల్లగా పుట్టినందుకు నన్ను చంపేయమని అమ్మకు కాంతమ్మ పెద్దమ్మ సలహా ఇవ్వడం ..." అన్నాను.
కృష్ణ ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు. గబుక్కున నా చెయ్యి గట్టిగా పట్టుకుని నవ్వుతూ , " కాని నీవు బ్రతికే ఉండటం నిజం... ఎందుకు బాధ ?" అన్నాడు. "కానీ నేను బాధపడటం నిజం ... అదే బాధ " అన్నాను . ఇద్దరం నవ్వటం మొదలెట్టాం. అకారణంగా చాలా సేపు నవ్వాము..... ఆ నవ్వు వ్యాపించి వ్యాపించి ప్రపంచాన్ని రంగుల కలగా మార్చేస్తుంది ! ........
రచయిత్రి : ఆర్ వసుంధరా దేవి నవల : ఓ పెళ్లి కథ ప్రచురణ : విజయ మాస పత్రిక తేదీ : ఫిబ్రవరి 1977